
మహారాష్ట్ర ప్రభుత్వం ఆటోరిక్షా, టాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్ల కోసం ఉచిత మరాఠీ భాషా తరగతులను ప్రకటించింది. ప్రజా రవాణా వాహనాల డ్రైవర్లకు ప్రాథమిక మరాఠీ పరిజ్ఞానం తప్పనిసరి చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. రవాణాశాఖ మంత్రి ప్రతాప్ సర్ణాయక్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా డ్రైవర్లు, ప్రయాణికుల మధ్య మెరుగైన సంభాషణ నెలకొల్పడం, రాష్ట్ర అధికార భాషకు ప్రోత్సాహం ఇవ్వడం, స్థానిక ప్రయాణికులతో మాట్లాడడంలో ఉన్న ఇబ్బందులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త విధానం ప్రకారం లైసెన్స్, పునరుద్ధరణ లేదా అనుమతిపత్రాల కోసం దరఖాస్తు చేసే డ్రైవర్లకు ఉపయోగకరమైన మరాఠీ భాషా పరిజ్ఞానం ఉండాలి.
అయితే డ్రైవర్ సంఘాల అభ్యంతరాల నేపథ్యంలో వెంటనే కఠిన చర్యలు తీసుకోవడం బదులు, ఉచిత శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించింది. రోజువారీ సంభాషణ, దారులు చెప్పడం, చార్జీల వివరాలు, ప్రయాణికులతో మాట్లాడే విధానం వంటి అంశాలపై ఈ తరగతులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ శిక్షణను ప్రత్యక్షంగా మరియు ఆన్‌లైన్ విధానంలో మరాఠీ సాహిత్య సంస్థల సహకారంతో నిర్వహించనున్నారు. వచ్చే నెల 1 నుంచి తనిఖీ కార్యక్రమం ప్రారంభమవుతుందని, తొలి దశలో భాషా పరీక్షల కంటే పత్రాల పరిశీలనకే ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో నిబంధనలు పాటించని డ్రైవర్లపై జరిమానాలు, లైసెన్స్ లేదా అనుమతిపత్రాల రద్దు వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది డ్రైవర్లపై ప్రభావం చూపనుండగా, సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రజాసేవ మెరుగుదల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!