
.jpg&w=3840&q=75)
రాష్ట్ర విభజన జరిగి దశాబ్దానికి పైగా గడిచినా, ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన రెండు కీలక సంస్థలైన కృష్ణానదీ యాజమాన్య బోర్డు మరియు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇప్పటికీ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. ఈ కార్యాలయాలను రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ, ఆయా సంస్థల ఉన్నతాధికారులు కొన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కృష్ణా బోర్డు విషయంలో, ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తూ ఛైర్మన్‌తో పాటు ఒక డివిజన్‌ను మాత్రం హైదరాబాద్‌లోనే కొనసాగించేలా కొత్త ప్రతిపాదనను రూపొందించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమహేంద్రవరం తరలించినా, సీఈవో క్యాంపు కార్యాలయం పేరుతో హైదరాబాద్‌లోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలను కేంద్ర జలశక్తి శాఖకు పంపుతున్నట్లు సమాచారం. పోలవరం అథారిటీని రాజమహేంద్రవరం తరలించాలని కేంద్రం గతంలోనే ఆదేశించినప్పటికీ, ఇప్పటివరకు పూర్తిస్థాయి తరలింపు జరగలేదు. అక్కడ అద్దె భవనం తీసుకుని కొంతమంది సిబ్బందిని మాత్రమే తరలించారు. ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఉన్నా, సీఈవో కార్యాలయం హైదరాబాద్‌లోనే కొనసాగించే ప్రయత్నాలు సాగుతున్నాయి.
అదే విధంగా కృష్ణా బోర్డును కూడా అమరావతికి లేదా విజయవాడకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఛైర్మన్ హైదరాబాద్‌లోనే ఉండేలా క్యాంపు కార్యాలయం కొనసాగించాలని కొత్త ప్రతిపాదన తీసుకురావడం వివాదాస్పదంగా మారింది. హైదరాబాద్‌లో చాలాకాలంగా పనిచేస్తున్న కొందరు ఏపీ అధికారులు కూడా ఈ తరలింపుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో, రాష్ట్రానికి రావాల్సిన కీలక సంస్థలు ఇంకా హైదరాబాద్‌కే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!