

హైదరాబాద్ వంటి నగరంలో కిరాణా లేదా ఫుడ్ డెలివరీలకు సాధారణంగా 10 నిమిషాల నుంచి 2 గంటల వరకు సమయం పడుతుంది. అయితే స్కై ఎయిర్ సంస్థ డ్రోన్ టెక్నాలజీతో ఈ సమయాన్ని కేవలం 7 నిమిషాలకు తగ్గించే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా, వచ్చే ఏడాది జూలైలో హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ కార్యక్రమంలో వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి “మెడిసిన్స్ ఫ్రం స్కై” ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ సంస్థ ఇప్పటికే పనిచేస్తోంది. హైదరాబాద్‌లో రోజుకు 3.75 లక్షల డెలివరీలు లక్ష్యంగా పెట్టుకుంది.
డ్రోన్లు సురక్షితంగా ప్రయాణించేందుకు వర్చువల్ స్కై టన్నెల్స్ ఏర్పాటు చేయబడతాయి. అన్మ్యాన్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా వాతావరణ పరిస్థితులు, గగనతల రద్దీని పరిశీలిస్తాయి. డ్రోన్లు 120 మీటర్ల ఎత్తులో ఎగురుతూ, గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత 20 మీటర్ల వరకు దిగిపోయి స్కైప్యాడ్లో పార్సిల్‌ను వదులుతాయి. 5జీ సాంకేతికత, రియల్ టైమ్ ట్రాకింగ్, సెన్సర్ల సహాయంతో అవి స్వయంచాలకంగా ప్రయాణిస్తాయి. ఒక్కో డ్రోన్ 10 కిలోల వరకు బరువు మోయగలదు. ప్రతి డెలివరీతో సుమారు 520 గ్రాముల కార్బన్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!