
వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హోటల్ రంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది. గత రెండు రోజులుగా అనేక హోటళ్లు తాత్కాలికంగా మూతపడగా, మరికొన్ని హోటళ్లు మెనూను తగ్గించడంతో పాటు ధరలను పెంచాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్ హోటళ్ల అసోసియేషన్ తాత్కాలికంగా టీ, కాఫీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఎక్కువ సమయం తీసుకునే చపాతి, దోసె, పూరీ వంటి వంటకాలను కూడా తాత్కాలికంగా అందుబాటులో ఉంచలేమని నిర్వాహకులు వెల్లడించారు.
టిఫిన్ బండ్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు వంటకు పూర్తిగా గ్యాస్‌పై ఆధారపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సిలిండర్లు ఒకటి రెండు రోజులకు మించి సరిపోవని హోటల్ యజమానులు చెబుతున్నారు. ఎస్సార్ నగర్, అమీర్‌పేట, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, అశోక్ నగర్, దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాల్లోని పీజీ హాస్టళ్లు, మెస్‌లలో కూడా మెనూలు మారాయి. ఎక్కువసేపు వండే వంటలను తగ్గించి అన్నం, పప్పు, సాంబారు, రసం వంటి సాధారణ వంటకాలకు మాత్రమే పరిమితం చేశారు. గ్యాస్ కొరత కొనసాగితే హాస్టళ్లను కూడా తాత్కాలికంగా మూసివేయాల్సి వస్తుందని నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా అల్పాహారాలపై రూ.10–15 వరకు ధరలు పెరగడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!