

తెలంగాణలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగి రాష్ట్రం మొత్తం వణికిపోతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో మరికొన్ని రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ కూడా తెలంగాణను కోర్ కోల్డ్ వేవ్ జోన్‌గా పరిగణిస్తున్నట్లు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల వరకు పడిపోవచ్చని అంచనా వేస్తోంది.
చలి కారణంగా జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, చర్మ సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, పెద్ద వయసువారు, దివ్యాంగులు, గర్భిణులు, చలిలో పనిచేసే కార్మికులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శరీరాన్ని వెచ్చగా ఉంచే దుస్తులు ధరించడం, గోరు వెచ్చని నీళ్లు తాగడం, చేతులను శుభ్రంగా ఉంచడం, శ్వాసకోశ సమస్యలున్న వారు ఇన్హేలర్లు దగ్గర ఉంచుకోవడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో మరికొన్ని రోజుల పాటు చలి తీవ్రత కొనసాగనుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంచిర్యాల, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఉదయం వరకు పొగమంచు కమ్ముకుంటుండడంతో ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా చలికి గురవుతున్నాయి. చిన్న పిల్లలు, నవజాత శిశువులు హైపోథెర్మియా ప్రమాదానికి లోనవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!