

హిడ్మా ఎన్కౌంటర్ పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట ఒక సంచలన లేఖ వెలువడింది. తాజాగా విడుదలైన ఈ లేఖలో, హిడ్మా మరియు శంకర్ల మరణం అసలు ఎన్కౌంటర్ కాదని, ముందుగానే అరెస్ట్ చేసి హతమార్చిన ఘటనగా మావోయిస్టులు ఆరోపించారు. వికల్ప్ ప్రకారం, అనారోగ్యంతో బాధపడుతున్న హిడ్మా మరియు శంకర్లు చికిత్స కోసం విజయవాడ వైపు వస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారని తెలిపారు. అరెస్టుకు కారణం ఏపీకి చెందిన కొంతమంది కలప వ్యాపారుల సహకారమనే ఆరోపణ కూడా లేఖలో ఉంది. ఈ వ్యాపారులు పోలీసులతో కలిసి సమాచారం ఇచ్చినందు వల్ల ఇద్దరూ పట్టుబడ్డారని మావోయిస్టులు మండిపడ్డారు. అరెస్టు తరువాత వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి చంపేశారన్న ఆరోపణను కూడా కమిటీ తీవ్రముగా ప్రస్తావించింది. వారిని హతమార్చిన తర్వాతే ఇది ఎన్కౌంటర్ అని ప్రకటించారని, నిజాన్ని దాచేందుకు పెద్ద స్థాయిలో కథనాలు సృష్టించారని వికల్ప్ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనల పై సమగ్ర దర్యాప్తు చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, గత నెల నవంబరు లో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో రెండు పెద్ద ఎన్కౌంటర్లు జరిగిన విషయం తెలిసిందే.
నవంబర్ 18 న జరిగిన ఘటనలో హిడ్మాతో పాటు ఆయన భార్య మరియు పలువురు అనుచరులు మరణించగా, నవంబర్ 19 న జరిగిన మరో ఎన్కౌంటర్లో శంకర్ సహా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఘటనల తరువాత, ఎన్కౌంటర్ ప్రదేశంలో దొరికిన ఒక డైరీ ఆధారంగా పోలీసులు ఏపీలోని పలు జిల్లాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించి సుమారు 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసి జైళ్లకు తరలించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!