

మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. అనర్హులు ఫేక్ అనుభవ ధ్రువీకరణ పత్రాలతో సర్వీస్ వెయిటేజీ మార్కులు పొందారని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
ఎంహెచ్ఎస్ఆర్బీ గతేడాది సెప్టెంబర్ 11న 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 100 మార్కుల్లో 80 మార్కులు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షకు, 20 మార్కులను ప్రభుత్వ సేవల్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన వారికి వెయిటేజీగా కేటాయించింది.
నోటిఫికేషన్ ప్రకారం గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి ప్రతి ఆరు నెలలకు 2.5 పాయింట్లు, ఇతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి ప్రతి ఆరు నెలలకు రెండు పాయింట్లు చొప్పున గరిష్టంగా 20 పాయింట్ల వెయిటేజీ ఇవ్వాల్సి ఉంది. అయితే గతంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థలు లేదా పథకాల్లో పనిచేసిన వారికి మాత్రమే ఈ వెయిటేజీ వర్తిస్తుందని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. నోటిఫికేషన్లో సూచించిన ఫార్మాట్లో ఉన్న అనుభవ ధ్రువీకరణ పత్రాలనే అంగీకరించాలి.
ఈ నెల 20 నుంచి 22 వరకు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయని అభ్యర్థులు చెబుతున్నారు. చార్మినార్, జోగులాంబ, యాదాద్రి, రాజన్న, భద్రాద్రి, బాసర, కాళేశ్వరం జోన్ల పరిధిలో కౌన్సెలింగ్ నిర్వహించగా, అనంతరం విడుదల చేసిన ఎంపిక జాబితాలో అనర్హులు ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేసేవారు, ఆర్టీపీసీఆర్ సైంటిస్టులు, టీ హబ్ మేనేజర్లు, ల్యాబ్ అటెండెంట్లు వంటి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధం లేని వారు కూడా ఫేక్ అనుభవ పత్రాలతో 20 శాతం వెయిటేజీ పొందారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అలాగే కరోనా సమయంలో తాత్కాలికంగా నియమితులైన వారి ఎంపిక కూడా నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటున్నారు.
ఈ వ్యవహారంపై ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని వాపోతున్న అభ్యర్థులు, ఫేక్ సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!