

గాలిలో నాణ్యత పడిపోవడంలో హైదరాబాద్ నగరం దేశ రాజధాని దిల్లీతో పోటీ పడుతోంది. కొత్త ఏడాది తొలి రోజున పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 300 వరకు చేరుకుంది. ఇది థర్డ్ పార్టీ, గూగుల్ యాప్‌లు, పరికరాల ద్వారా నమోదవుతున్న సూచీల ప్రకారం లెక్క. కానీ సీపీసీబీ ఏర్పాటు చేసిన సూచీలలో మాత్రం కొత్త ఏడాది గరిష్ఠంగా 170 వరకే నమోదు కావడం గమనార్హం. సీపీసీబీ సూచించే కొలతల్లో కచ్చితత్వం లేదని కొందరు విశ్రాంత ప్రొఫెసర్లు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలోని 14 ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి ఏక్యూఐ పరికరాలను ఏర్పాటు చేసింది.
వీటి ద్వారా పీసీబీ గరిష్ఠ, కనిష్ఠ సూచీలను వెల్లడిస్తోంది. ఏక్యూఐ 100 దాటితే ముప్పు పొంచి ఉన్నట్లే అని చెబుతోంది. డిసెంబరులో హైదరాబాద్‌లో గరిష్ఠంగా పీసీబీ లెక్కల ప్రకారం ఏక్యూఐ 132 మాత్రమే ఉంది. థర్డ్ పార్టీ యాప్‌లలో నమోదైన ఏక్యూఐ 270 వరకు ఉండటం గమనార్హం. ఇంత వ్యత్యాసం ఉండకూడదని ఒక పక్క శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలి నాణ్యతను యురోపియన్ ప్రమాణాల మేరకు కొలిచే మెషిన్ల ధర ఒక్కొక్కటి దాదాపు రూ.30 లక్షల వరకు ఉంటుంది. పీసీబీ వాడుతున్న పరికరాలు ఆ స్థాయిలో పని చేయలేవని పరిశోధకులు చెబుతున్నారు.
నిత్యం రోడ్డెక్కుతున్న 50 లక్షల వాహనాలు! :
హైదరాబాద్‌లో దాదాపు 80 లక్షల వాహనాలుంటే రోజూ సగటున 50 లక్షల వరకు రోడ్డు మీదకు వస్తున్నాయి. వీటి నుంచి వెలువడే పొగ గాలి నాణ్యతను తీవ్ర ప్రభావితం చేస్తోంది. వీటితో పాటు భవన నిర్మాణాలు, చెత్తాచెదారం, మురుగు, పరిశ్రమల నుంచి వెలువడే ఘాటు వాసనలు వాయు నాణ్యతను మరింత క్షీణింపచేస్తున్నాయి.
కేపీహెచ్బీలో ఏక్యూఐ 302 :
శనివారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ కూకట్పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని గాలిలో వాయు నాణ్యత సూచీ 302 సూచించింది. ఇది దిల్లీలో ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్)తో సమానంగా ఉంది. కానీ, ఈ ప్రాంతంలో సీపీసీబీ (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు)కు సంబంధించిన వాయు నాణ్యతను లెక్కించే సూచీలే లేవు. శనివారం సీపీసీబీ లెక్కల ప్రకారం హైదరాబాద్‌లోని బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో ఏక్యూఐ గరిష్ఠంగా 142, రామచంద్రాపురంలో కనిష్ఠంగా 73 నమోదవడం గమనార్హం.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!