

పైరసీ కేసులో ఐబొమ్మ నిర్వహించిన ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ అరెస్టుపై నెటిజన్లు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన టెక్నికల్ టాలెంట్‌ను కొందరు ప్రశంసిస్తుండగా, చట్టాన్ని ఉల్లంఘించాడంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. నటుడు శివాజీ కూడా రవి స్కిల్ గురించి వ్యాఖ్యానిస్తూ అతని నైపుణ్యాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే రవి తండ్రి అప్పారావు మాత్రం ఈ ఘటనపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “నా కుమారుడు తప్పు చేశాడని నేనే అంగీకరిస్తున్నాను.
చట్టం ముందు మనం అందరం సమానమే. అతను నా కొడుకు కాబట్టి శిక్ష లేకుండా వదిలేయమని నేను కోరడం లేదు” అని ఆయన చెప్పారు. ఒక్కసారిగా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న అప్పారావు మాట్లాడుతూ-- “సజ్జనార్ సార్-- మాపై కనికరంగా చూడండి. స్టేషన్లో రవిని ఇబ్బంది పెట్టకండి. కానీ చట్ట ప్రకారం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నా కుమారుడికి ఒక చిన్న కూతురు ఉంది. ఆమె భవిష్యత్తు గురించే ఇప్పుడు నా హృదయం ముక్కలైపోతోంది. కోడలు కూడా నాతో మాట్లాడడం లేదు. మనవరాలి భవిష్యత్తు కోసం అయినా రవికి కొంచెం తక్కువ శిక్ష పడేలా చూడండి” అని ఆయన అభ్యర్థించారు. చట్టం ఎవరిని వదిలిపెట్టదని తెలుసునని, అయినా తాను తండ్రిగా ఇంతకంటే ఇంకేమి చేయలేనని, తన బలహీనతే తన కన్నీళ్లు అని కూడా అప్పారావు బాధతో చెప్పారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!