

మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు టీజీఎస్ఆర్టీసీ 43 శైవక్షేత్రాలకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ నెల 15 న మహా శివరాత్రి పర్వదినం ఉండగా, 14 నుంచి 16 తేదీల వరకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71 బస్సులు కేటాయించగా, ఇతర ఆలయాలకు 273 సర్వీసులు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, తాగునీరు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. శివరాత్రి ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరలను 1.5 రెట్లు సవరించినప్పటికీ, రెగ్యులర్ సర్వీసుల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
టీజీఎస్ఆర్టీసీ వీసీ & ఎండీ వై. నాగిరెడ్డి ఐపీఎస్ శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం కంటే ఈసారి 208 అదనపు బస్సులు నడపనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని, ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ www.tgsrtcbus.in వెబ్సైట్లో అందుబాటులో ఉందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 040-69440000, 040-234500332 నంబర్లను సంప్రదించవచ్చు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!