

నంద్యాల జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన చాక్లెట్లు తినడంతో 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం ఏర్పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నందికోట్కూరు ప్రాంతానికి చెందిన ఓ బాలిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆ బాలిక స్కూలుకు వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు చాక్లెట్ల ప్యాకెట్ ఇచ్చాడు. వాటిని ఉపాధ్యాయులు, విద్యార్థులకు పంపిణీ చేయాలని చెప్పినట్లు సమాచారం.
స్కూలుకు చేరుకున్న అనంతరం ఆ బాలిక పీటీ టీచర్‌తో పాటు పలువురు విద్యార్థినులకు చాక్లెట్లను పంచింది. చాక్లెట్లు తిన్న కొద్దిసేపటికే బాలికల్లో అస్వస్థత లక్షణాలు కనిపించాయి. కనురెప్పలు నల్లగా మారడం, కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు తలెత్తడంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం విద్యార్థినులు కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చాక్లెట్లు ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? బాలికను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు? చాక్లెట్లలో ఏదైనా హానికర పదార్థాలు ఉన్నాయా? అనే అంశాల పై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!