

ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఎన్నికల సంఘం (ఈసీ) అనుసరిస్తున్న విధానాలు, రక్షణ చర్యలపై సీపీఐ నేత నారాయణ ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘ఎద్దు ఈనిందంటే దూడను మానగట్టులో కట్టేయమన్నట్టుగా ఉంది’’ అనే సామెతను ప్రస్తావిస్తూ.. ఈసీ నేటి చర్యలకు, ఆ మూర్ఖత్వానికి ఏమైనా తేడా ఉందా అని ప్రశ్నించారు. సాంకేతికపరమైన లోపాలను సరిదిద్దాల్సిందేనని, అయితే వాటిని పౌరుల ఓటుహక్కుకు అడ్డంకులుగా మార్చకూడదని పేర్కొన్నారు. ప్రముఖులు ఎల్.కే. అద్వానీ, ఎస్. జైశంకర్ వంటి వారికి కూడా నోటీసులు ఎందుకు జారీ చేస్తున్నారో ఈసీ వివరించాలని డిమాండ్ చేశారు.
నోటీసులు జారీ చేయడానికి అనుసరిస్తున్న ప్రమాణాలు, ఆధారాలు, చట్టపరమైన ప్రాతిపదికను ఈసీ బహిరంగంగా వెల్లడించాలని నారాయణ కోరారు. ప్రతి ఓటరుకు తన వాదనను వినిపించే న్యాయమైన అవకాశం కల్పించాలని, తప్పుడు తొలగింపులను నిరోధించేందుకు పారదర్శకమైన రక్షణ చర్యలను ప్రకటించాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఓటుహక్కును కాపాడేలా ఉండాలే తప్ప, దానిని ప్రమాదంలోకి నెట్టేలా ఉండకూడదని అన్నారు. ఈసీ ప్రజలకు, పార్లమెంటుకు, రాజ్యాంగానికి జవాబుదారీగా వ్యవహరించాలని, పారదర్శక చర్యల ద్వారా తన స్వతంత్రతను నిరూపించుకోవాలని నారాయణ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!