

రాష్ట్రంలో నేరమయ రాజకీయాలను ప్రోత్సహించి, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. అనంతపురం జిల్లా కౌకుంట్లలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ అవసరాల కోసం ఎన్నికల సంఘాలను దుర్వినియోగం చేసిన తొలి ముఖ్యమంత్రి జగన్ అని ఆరోపించారు. గతంలో ఎన్నికల కమిషనర్‌కు ప్రాణహాని ఉందని భావించి పొరుగు రాష్ట్రానికి వెళ్లి రక్షణ పొందాల్సిన పరిస్థితి ఏర్పడిందని, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులను బెదిరించిన ఘటనలను ప్రజలు మరిచిపోలేదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, ఎన్నికల గురించి జగన్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
పురపాలక ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత జగన్ అసత్య ప్రచారాలకు దిగడం ఆయన అసమర్థతకు నిదర్శనమని పయ్యావుల అన్నారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. బెంగళూరు నుంచి జాతీయ మీడియా ప్రతినిధులను తీసుకొచ్చి ఏదో జరిగిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ బాక్సులను ఎత్తుకెళ్లింది వైసీపీ కార్యకర్తలేనని, పోలీసులపై దాడులు చేసి తిరిగి వారిపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు ఇలాంటి నాటకాలకు తెరలేపుతున్నారని మంత్రి ఆరోపించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!