

హైదరాబాద్‌లోని ‘క్యూర్’ ప్రాంతంలో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి త్వరలో ఊరట లభించనుంది. ఈ రెండు రవాణా వ్యవస్థల్లో ప్రయాణించేందుకు ప్రవేశపెట్టిన ఉమ్మడి పాస్ ధరలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రతిపాదనల ప్రకారం రోజువారీ పాస్ ధరను ప్రస్తుతం ఉన్న రూ.400 నుంచి రూ.325కు, నెలవారీ పాస్ ధరను రూ.8,500 నుంచి రూ.4,000 లేదా రూ.4,500కు తగ్గించనున్నారు. ఈ అంశంపై మెట్రో రైలు, ఆర్టీసీ యాజమాన్యాల మధ్య చర్చలు జరిగి ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో ఆర్టీసీ ఎండీ, మెట్రో రైలు సలహాదారు సమావేశం అనంతరం ధరలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొత్త ధరలను దీపావళి నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఉమ్మడి పాస్ ధరలు అధికంగా ఉండటంతో ప్రయాణికుల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. ముఖ్యంగా నెలవారీ పాస్ ధర రూ.8,500గా ఉండటం వినియోగంపై ప్రభావం చూపింది. దీంతో ధరలు తగ్గించాలని ప్రభుత్వం సూచించగా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మెట్రో రైలు సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి మధ్య చర్చలు జరిగినట్లు తెలిసింది. నెలవారీ పాస్‌లో ఆర్టీసీకి రూ.1,000, మెట్రోకు రూ.3,000 లేదా రూ.3,500 కేటాయించేలా ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. రోజువారీ పాస్‌లో ఆర్టీసీకి రూ.75, మెట్రోకు రూ.250 చొప్పున వాటా ఇవ్వాలని చర్చించినట్లు తెలుస్తోంది. అయితే తుది ధరలు, అమలు తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!