

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మరో చారిత్రక శాసనం వెలుగుచూసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) నిపుణులు భారత్-శ్రీ ప్రాజెక్టులో భాగంగా ఆలయంలోని శాసనాల అచ్చులను సేకరిస్తుండగా ఈ శాసనాన్ని గుర్తించారు. శ్రీవారి ఆలయంలోని మూడో ప్రాకారం దక్షిణ గోడపై ఈ శాసనం ఉంది. తమిళ భాషలో ఉన్న ఈ శాసనాన్ని అచ్యుతదేవరాయల కాలంలో, 1540 డిసెంబరు 31న ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఆలయ చరిత్ర, అప్పటి దాతృత్వం, స్వామివారికి నిర్వహించిన సేవలకు సంబంధించిన వివరాలు ఇందులో నమోదయ్యాయి.
శాసనం ప్రకారం, తిరుమల శ్రీవారికి విశేష పర్వదినాల్లో నైవేద్యాలు, ప్రసాదాలు సమర్పించడంతోపాటు ఇతర సేవలు నిర్వహించేందుకు చంద్రగిరి కోట మిలిటరీ కమాండర్ దళవాయి తిమ్మర సయ్యర్ విరాళాలు అందించారు. గోకులగుంట-సీమలోని సమాపురం-తిన్నై గ్రామం నుంచి వచ్చే ఆదాయంలో 150 బంగారు నాణేలను ఇందుకోసం కేటాయించినట్లు శాసనంలో పేర్కొన్నారు. అదనంగా స్వామివారి నైవేద్యాలు, ఇతర సేవల నిర్వహణ కోసం 15,000 పణాలను ఆలయ నిధికి జమ చేసినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. ఈ శాసనం ద్వారా విజయనగర కాలంలో తిరుమల ఆలయానికి అందిన విరాళాలు, సేవల నిర్వహణకు చేసిన ఏర్పాట్లపై మరిన్ని చారిత్రక వివరాలు వెలుగులోకి వచ్చాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!