

పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. మొత్తం 2,721 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 11 నుంచి 30 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబరు 20 నుంచి జనవరి 13 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) నిర్వహించనున్నారు. డిసెంబరు 5న ఆన్‌లైన్ మాక్ టెస్ట్ అందుబాటులోకి రానుండగా, డిసెంబరు 14 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చివరి పరీక్ష పూర్తయిన రెండు రోజుల తర్వాత ప్రాథమిక కీని విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణకు వారం రోజుల గడువు ఇవ్వనున్నారు. అనంతరం మరో వారంలో తుది కీని ప్రకటించనున్నారు.
మొత్తం ఖాళీల్లో జనరల్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు 2,111 ఉన్నాయి. ప్రత్యేక విద్య విభాగంలో ఎస్‌ఏ, ఎస్జీటీ పోస్టులు 350, సొసైటీలు, ఇతర యాజమాన్యాల పరిధిలో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ పోస్టులు 260 ఉన్నాయి. పోస్టుల రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు, హారిజాంటల్ రిజర్వేషన్ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. క్రీడాకోటా అభ్యర్థులకు కూడా రాతపరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, దరఖాస్తు విధానం, పరీక్షల షెడ్యూల్‌ను పరిశీలించి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!