

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దర్శన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ గురువారం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు తొలి మూడు రోజులకు ఆన్‌లైన్ ఈ-డిప్ ద్వారా ఎస్‌ఎస్‌డీ టోకెన్లు కేటాయించాలని వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. మిగిలిన ఏడు రోజులు సర్వదర్శనం అమలు చేయాలని సూచించారు. డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం అభిషేక సమయంలోనూ సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదే సమయంలో తిరుమలలోని వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను దేశానికే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్నట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సహకారంతో కేవలం 11 నెలల్లోనే అత్యాధునిక సదుపాయాలతో ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దేశంలోని ఇతర దేవాలయ సంస్థల్లో లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో దీనిని నిర్మించినట్లు పేర్కొన్నారు. తిరుమలలో వినియోగించే నెయ్యి నమూనాలను ప్రతిరోజూ పరీక్షించిన తర్వాతే వినియోగానికి అనుమతిస్తున్నట్లు ఆయన వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!