

ఇజ్రాయెల్‌లో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మాజీ సైన్యాధిపతి, యాషర్ పార్టీ అధినేత గాడి ఐసెన్‌కోట్‌కు అరబ్ పార్టీలైన జాయింట్ లిస్ట్, రామ్ మద్దతు ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంటులో ఐసెన్‌కోట్‌కు మద్దతుగా మొత్తం 67 మంది ఎంపీలు అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌కు సిఫారసు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 61 మంది ఎంపీల మద్దతు కంటే ఇది ఎక్కువ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అరబ్ పార్టీలైన జాయింట్ లిస్ట్ 11 స్థానాలు, రామ్ పార్టీ 8 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ రెండు పార్టీల మద్దతుతో ఐసెన్‌కోట్ బలం పెరగగా, ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది.
మరోవైపు, నెతన్యాహుకు చిరకాల మిత్రపక్షమైన అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీ యునైటెడ్ తోరా జుడాయిజం అధ్యక్షుడి సంప్రదింపుల్లో ఏ అభ్యర్థికీ మద్దతు ప్రకటించకపోవడం ఆయనకు ప్రతికూలంగా మారింది. నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి పార్లమెంటులో 53 స్థానాలు ఉన్నప్పటికీ, ఆయనకు మద్దతుగా 46 మంది ఎంపీలు మాత్రమే సిఫారసు చేశారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అభ్యర్థిపై అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఆదివారం తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఐసెన్‌కోట్‌కు 67 మంది ఎంపీల సిఫారసులు లభించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇంకా ఖరారు కాలేదు. స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సామర్థ్యం ఉన్న అభ్యర్థిని అధ్యక్షుడు ఎంపిక చేయాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!