

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను రోజువారీ పనుల్లో సమర్థంగా వినియోగించడంలో భారత్ ప్రపంచంలోనే ముందంజలో ఉంది. మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన ‘వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026’ నివేదిక ప్రకారం.. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, నెదర్లాండ్స్, బ్రెజిల్ సహా 10 ప్రధాన మార్కెట్లలో భారత్‌లోనే అత్యధిక స్థాయిలో ఏఐ ఆధారిత నిపుణుల వినియోగం నమోదైంది. దేశంలోని ఏఐ వినియోగదారుల్లో 32 శాతం మంది సంక్లిష్టమైన బహుళ దశల పనుల్లో ఏఐ సహాయకులను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచ సగటు 16 శాతంతో పోలిస్తే రెట్టింపు. గతేడాదితో పోలిస్తే ఏఐ సాయంతో గతంలో చేయలేని పనులను కూడా సులభంగా చేయగలుగుతున్నామని 78 శాతం మంది భారతీయులు తెలిపారు.
ఏఐ అందించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా మానవ పర్యవేక్షణకు భారత నిపుణులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 63 శాతం మంది నాణ్యత నియంత్రణకు, 59 శాతం మంది విమర్శనాత్మక ఆలోచనకు ప్రాధాన్యమిస్తున్నారు. మరోవైపు, 87 శాతం మంది తుది నిర్ణయాధికారం తమ చేతుల్లోనే ఉందని, ఏఐ ఫలితాలను తుది నిర్ణయంగా కాకుండా ప్రారంభ బిందువుగా మాత్రమే చూస్తున్నామని వెల్లడించారు. దేశీయ ఐటీ సంస్థల్లోనూ ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ సంస్థలు ఆరు నెలల్లోనే కలిపి 4 లక్షలకు పైగా మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ లైసెన్సులను పొందాయి. విప్రో ఉద్యోగులు 29 వేలకు పైగా ఏఐ సహాయకులను అభివృద్ధి చేయగా, టీసీఎస్‌లో ఏఐ వినియోగంతో పరిశోధన, కంటెంట్ విభాగాల్లో ఉత్పాదకత 20–25 శాతం పెరిగినట్లు సంస్థ గుర్తించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!