

న్యాయ విద్యార్థుల ప్రవర్తనను నియంత్రించే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ), రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు లేదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం సంబంధిత విద్యా సంస్థలకే ఉంటుందని పేర్కొంది. నల్సార్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించిన విద్యార్థులపై బీసీఐ చర్యలు తీసుకోవడం నేపథ్యంలో దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనల ధర్మాసనం బీసీఐ అధికార పరిధిపై స్పష్టత ఇచ్చింది.
మరోవైపు జాతీయ రహదారులపై ఆక్రమణలు, అక్రమంగా నిలిపివేసిన వాహనాల కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదాలను నివారించేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిఘా కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేసి, టోల్‌ప్లాజాల నుంచి వాటిని పర్యవేక్షించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించింది. రాజస్థాన్‌లోని ఫాలోదీ ప్రాంతంలో జాతీయ రహదారిపై నిలిచిన ట్రైలర్‌ను టెంపో ట్రావెలర్ ఢీకొని 15 మంది మృతి చెందిన ఘటనపై సుమోటోగా విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ సూచనలు చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!