

2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత ఆటోమొబైల్ పరిశ్రమ నిరంతర ఆవిష్కరణలు, అత్యుత్తమ ఉత్పత్తులతో ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతీయ వాహన తయారీదారుల సంఘం (సియామ్) 2026 వార్షిక సదస్సుకు పంపిన సందేశంలో, ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారత వాహన పరిశ్రమకు అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించేందుకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వాహనాలకు డిమాండ్ పెరుగుతోందని, హైవేలు, మౌలిక సదుపాయాల విస్తరణతో ఆటో రంగానికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని మోదీ అన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్న నేపథ్యంలో భారత ఆటో పరిశ్రమ సరికొత్త మొబిలిటీ పరిష్కారాలపై దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు. ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ, సంస్కరణలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలు దేశీయ తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తున్నాయని చెప్పారు. మరోవైపు, పెట్రోల్, డీజిల్ వాహనాలపై భవిష్యత్తులో మరిన్ని నియంత్రణలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. 2027 అక్టోబర్ నుంచి భారత్ NCAP 2.0 అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇదే సమయంలో వాహనాల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడటం కీలకమని మారుతీ సుజుకీ ఎండీ, సీఈఓ హిసాషి టకేచి పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!