

ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా, పలు అవకతవకలు వెలుగులోకి వచ్చినా ‘స్వచ్ఛమైన’ ఓటర్ల జాబితా రూపకల్పన పేరుతో ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ మూడో దశను పూర్తి చేసింది. ఈ దశలో 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 36.73 కోట్ల మంది ఓటర్ల జాబితాలను పరిశీలించి సుమారు 6 కోట్ల పేర్లను తొలగించినట్టు ఈసీ ప్రకటించింది. తొలి దశతో పోలిస్తే మూడో దశలో వ్యతిరేకత తక్కువగా కనిపించినప్పటికీ, మూడు దశల్లో కలిపి దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు జాబితాల నుంచి గల్లంతయ్యాయి. అయితే వీరంతా శాశ్వతంగా ఓటు హక్కు కోల్పోయినట్టేమీ కాదు. అభ్యంతరాలు వ్యక్తం చేసి, ఈసీ కోరిన పత్రాలు సమర్పిస్తే తిరిగి జాబితాలో చేరే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం, సమయం కేటాయించడం, ఖర్చులు భరించడం సామాన్యులకు భారంగా మారే పరిస్థితి ఉంది.
బెంగాల్‌లో పేర్లు, వివరాల్లో స్వల్ప తేడాల కారణంగా లక్షలాది మంది ఓటర్లు జాబితాల్లో చోటు కోల్పోయారని విమర్శలు ఉన్నాయి. ‘తార్కిక వ్యత్యాసాల’ పేరుతో తొలగించిన వారిలో 38 లక్షల మంది 19 ట్రిబ్యునళ్లను ఆశ్రయించగా, ఇప్పటివరకు పరిష్కరించిన అప్పీళ్లలో సుమారు 90 శాతం మందికి తిరిగి చోటు లభించినట్టు పేర్కొంటున్నారు. మరోవైపు, జార్ఖండ్‌లో ముసాయిదా జాబితాల అనంతరం కొందరి పేర్ల తొలగింపునకు ఫామ్-7 దరఖాస్తులు సమర్పించిన ఘటనలపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఓటరు జాబితాలో పేరు లేకపోవడం కేవలం ఎన్నికల హక్కును కోల్పోవడానికే పరిమితం కాకుండా, భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, పౌర హక్కులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల ఓటర్లను తమ ఉనికిని నిరూపించుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టకుండా, పారదర్శకంగా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!