

ఐపీఎల్లో దాదాపు రెండు దశాబ్దాల పాటు అభిమానులను అలరించిన మహేంద్ర సింగ్ ధోనీ ఆటగాడిగా తన ప్రయాణానికి ముగింపు పలికారు. అయితే ఆయన రిటైర్మెంట్ నిర్ణయం గురించి సీఎస్కే యాజమాన్యానికి నవంబర్ 17న మాత్రమే తెలిసిందనేది నిజం కాదు. నవంబర్ 14న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనే ధోనీ తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు సీఎస్కే సహ యజమాని రూపా గురునాథ్ తెలిపారు. ఐపీఎల్ 2027 కోసం ఆటగాళ్లను కొనసాగించడం, విడుదల చేయడం, కొత్త ఆటగాళ్ల ఎంపికపై చర్చ జరుగుతున్న సమయంలో సీఎస్కే మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ ఆటగాళ్ల విడుదల జాబితాను చదువుతుండగా.. ధోనీ తన పేరు కూడా ఆ జాబితాలో చేర్చాలని సున్నితంగా సూచించారు. ఆయన మాటలతో సమావేశంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారని రూపా వెల్లడించారు. ధోనీ నిర్ణయం చెప్పిన వెంటనే వీడియో కాల్ కట్ కావడంతో మళ్లీ ఫోన్ చేసి మాట్లాడినట్లు, వచ్చే సీజన్లో ధోనీ ఆడరనే విషయాన్ని ఇంటర్నెట్ కూడా తట్టుకోలేకపోయినట్లుందని సరదాగా వ్యాఖ్యానించినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు.
ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదని రూపా గురునాథ్ తెలిపారు. కొన్ని నెలల క్రితం జరిగిన సమావేశంలోనే వచ్చే సీజన్లో ఆడగలనా లేదా అన్నది తనకు తెలియదని ధోనీ చెప్పినట్లు వెల్లడించారు. జట్టుకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేనప్పుడు ఆడేందుకు ధోనీ ఇష్టపడరని, తన వల్ల జట్టుకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. గత సీజన్లో గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోవడం కూడా రిటైర్మెంట్ నిర్ణయంపై ప్రభావం చూపి ఉండొచ్చని పేర్కొన్నారు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్కేతో అనుబంధం కొనసాగించిన ధోనీ, రెండు సీజన్లలో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తరఫున ఆడారు. ఆయన నాయకత్వంలో చెన్నై ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లు సాధించింది. ఆటగాడిగా తప్పుకున్నప్పటికీ సీఎస్కేతో బంధం కొనసాగించనున్న ధోనీ, 2027 సీజన్ నుంచి మెంటార్‌గా బాధ్యతలు చేపట్టి యువ ఆటగాళ్లకు మార్గదర్శకత్వం చేయనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!