

ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా పాకిస్థాన్ సైన్యంపై భారత్ తీవ్ర విమర్శలు చేసింది. ఆ దేశ సహజ వనరులను ప్రజల సంక్షేమం కోసం వినియోగించకుండా సొంత ప్రయోజనాల కోసం దోచుకుంటోందని ఆరోపించింది. సహజ వనరుల అంశంపై ఐరాసలో జరిగిన సమావేశంలో భారత దౌత్యవేత్త పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ.. పాక్ సైన్యాధిపతి అసిం మునీర్ గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వివిధ ఖనిజాలతో కూడిన పెట్టెను ప్రదర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. పాకిస్థాన్ ఖనిజ సంపద వినియోగంలో సైన్యం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటోందనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల వెనుక కూడా సైన్యం పాత్ర ఉందన్న ఆరోపణలను ఆయన ప్రస్తావించారు.
పాకిస్థాన్ పాలకులు సహజ వనరులను స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలని హరీశ్ సూచించారు. స్థానిక ప్రజలకు ఖనిజ సంపద ద్వారా నేరుగా ప్రయోజనం చేకూరినప్పుడే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. పాక్ ప్రతినిధి బృందం సింధు జలాల ఒప్పందాన్ని ప్రస్తావించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక వివాదాలపై పాకిస్థాన్‌తో చర్చించే ఉద్దేశం భారత్‌కు లేదని తేల్చిచెప్పారు. గతేడాది సెప్టెంబరులో అసిం మునీర్ ట్రంప్‌కు ఖనిజాల పెట్టెను చూపించడం, పాక్ సైన్యానికి అనుబంధంగా ఉన్న ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ అరుదైన ఖనిజాల అన్వేషణ కోసం అమెరికాకు చెందిన యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం వంటి పరిణామాలను కూడా హరీశ్ ప్రస్తావించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!