

బాలీవుడ్ స్టార్ జంట ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ 2022లో వివాహం చేసుకున్నప్పటి నుంచి వీరి వ్యక్తిగత జీవితం తరచూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ బంధంలో ఆలియాకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొందరు నెటిజన్లు తమకు తోచిన విధంగా ఊహాగానాలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఈ విమర్శలపై పెద్దగా స్పందించని ఆలియా భట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తమ బంధం గురించి పూర్తిగా తెలియని వ్యక్తులు చేసే వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. మహిళలు ఎప్పుడూ తమ మనసు చెప్పేది వినాలని, సొంత నిర్ణయాలు తీసుకోవాలని, తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా కొనసాగించాలని తాను చెబుతుంటానని గుర్తుచేశారు.
తనను ఇతరులు ఊహించుకున్న ఏదో కష్టమైన పరిస్థితిలో చిక్కుకున్న బాధితురాలిగా చిత్రీకరించడం చాలా అవమానకరమని ఆలియా స్పష్టం చేశారు. తమ బంధం సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా ఉండటం వల్లే ఇలాంటి విమర్శలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఏమీ చెప్పకపోయినా ఎదుటివారు మనసులోని భావాలను అర్థం చేసుకోవడం, ప్రత్యేకంగా ఏమీ చేయకపోయినా మనల్ని గుర్తించడం.. ఇవే బలమైన బంధానికి పునాదులని ఆమె వివరించారు. రణ్‌బీర్ తనను అలానే అర్థం చేసుకుంటారని, తమ మధ్య అలాంటి అనుబంధం ఉందని వెల్లడించారు. ఆలియా తాజా వ్యాఖ్యలతో ఈ జంట బంధంపై సోషల్ మీడియాలో కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న ఊహాగానాలపై మరోసారి చర్చ మొదలైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!