

నార్వే చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. టోటల్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టూర్ పైలట్ టోర్నీలో కజకిస్థాన్ క్రీడాకారిణి బిబిసారా అసౌబాయేవాతో జరుగుతున్న పోటీ నుంచి అతడు అర్ధంతరంగా వైదొలిగాడు. అయితే, తాను మ్యాచ్ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని ప్రత్యర్థికి నేరుగా తెలియజేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోవడం వివాదానికి దారితీసింది. తాను వెళ్తున్నట్లు ఆర్బిటర్‌కు కార్ల్‌సన్ చెప్పినప్పటికీ, ఆ సమాచారాన్ని బిబిసారాకు తెలియజేయలేదు. దీంతో కార్ల్‌సన్ తిరిగి వస్తాడేమోనని ఆమె కొంతసేపు ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో పాటు, క్రీడాకారుల మధ్య ఉండాల్సిన మర్యాద, క్రీడాస్ఫూర్తిపై చర్చ మొదలైంది.
మరోవైపు, ఈ టోర్నీలో కార్ల్‌సన్ ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేదు. గ్రూప్ దశలో మొత్తం 10 గేములు ఆడిన అతడు తొమ్మిదింటిని డ్రా చేసుకోగా, ఒకదాంట్లో ఓటమి పాలయ్యాడు. దీంతో ఐదో స్థానంతో సరిపెట్టుకుని 21.8 రేటింగ్ పాయింట్లను కోల్పోయాడు. ఫలితంగా 15 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను కోల్పోతాడేమోనని అభిమానులు ఆందోళన చెందారు. అయితే, ఈ పైలట్ టోర్నీ పాయింట్లను అధికారిక రేటింగ్ లెక్కల్లో పరిగణనలోకి తీసుకోబోమని ఫిడే స్పష్టం చేయడంతో అతడి నంబర్ వన్ ర్యాంక్‌కు ఎలాంటి ముప్పు ఏర్పడలేదు. అయినప్పటికీ, టోర్నీ నిర్వాహకులతో పాటు కార్ల్‌సన్ వ్యవహారశైలిపై విమర్శలు వచ్చాయి. భారత చెస్ ఒలింపియాడ్ జట్టు కెప్టెన్ శ్రీనాథ్ నారాయణన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, రేటింగ్ కంటే ముందే హుందాతనం, మర్యాద దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!