

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రముఖ జట్టుగా గుర్తింపు పొందిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) యాజమాన్యంలో కీలక మార్పు చోటుచేసుకోనుందని సమాచారం. జట్టు సహ యజమాని జయ్ మెహతా తనకున్న 45 శాతం వాటాలో సగాన్ని, అంటే 22.5 శాతం వాటాను అమెరికాకు చెందిన పెట్టుబడుల సంస్థ ఎరెస్ మేనేజ్‌మెంట్‌కు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఒప్పందం విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు (రూ. 3,300 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా. ఈ లావాదేవీ ఆధారంగా కేకేఆర్ మొత్తం విలువ 1.78 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 16,634 కోట్లు) నిర్ణయించినట్లు సమాచారం.
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు కేకేఆర్‌లో 55 శాతం వాటా ఉండగా, జయ్ మెహతా, ఆయన భార్య, నటి జూహీ చావ్లాకు కలిపి 45 శాతం వాటా ఉంది. వీరంతా కలిసి 2007లో ఈ జట్టును కొనుగోలు చేశారు. తాజా ఒప్పందం పూర్తిగా నగదు రూపంలో జరగనుండగా, దీనికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతి తప్పనిసరి. కొత్త పెట్టుబడిదారుడి నేపథ్యాన్ని బీసీసీఐ పరిశీలించనుంది. ఒప్పంద విలువలో 5 శాతం, అంటే సుమారు 20 మిలియన్ డాలర్లను రుసుముగా చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఎరెస్ మేనేజ్‌మెంట్‌కు ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో చెల్సీ ఎఫ్‌సీ, అమెరికా ఫుట్‌బాల్ లీగ్‌లో మయామి డాల్ఫిన్స్, ది హండ్రెడ్ టోర్నీలో ట్రెంట్ రాకెట్స్ జట్లలో పెట్టుబడులు ఉన్నాయి. ఈ పరిణామంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలపై అంతర్జాతీయ పెట్టుబడిదారుల ఆసక్తి మరోసారి చర్చనీయాంశంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!