

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును కుదిపేసిన 2018 బాల్ టాంపరింగ్ వివాదం (శాండ్‌పేపర్ గేట్) మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఘటనపై అప్పట్లో పూర్తిస్థాయి విచారణ జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (CA) కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి జట్టులోని ఆటగాళ్ల నుంచి మరోసారి వాంగ్మూలాలు సేకరించనున్నట్లు ప్రకటించింది. ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథ ‘సబ్ర్’లో ఈ వివాదానికి సంబంధించి స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌లను మాత్రమే బలిపశువులను చేశారని పేర్కొన్నాడు. జట్టులోని ఇతర ఆటగాళ్లకు కూడా శాండ్‌పేపర్ వ్యవహారం గురించి తెలుసని వెల్లడించాడు. దీనిపై స్పందించిన వార్నర్.. గతంలో క్రికెట్ ఆస్ట్రేలియా సరైన రీతిలో విచారణ జరపలేదని విమర్శించాడు.
ఈ వ్యవహారంపై పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు విచారణకు ముందుకొచ్చే వారి గోప్యతను కాపాడేందుకు స్వతంత్ర సంస్థకు బాధ్యతలు అప్పగిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ టాడ్ గ్రీన్‌బెర్గ్ వెల్లడించారు. ఈ వివాదానికి ముగింపు పలికి అందరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సీఏ నిర్ణయాన్ని ఖవాజా స్వాగతిస్తూ, మిగిలిన ప్రశ్నలకు త్వరగా సమాధానాలు లభించాలని ఆకాంక్షించాడు. అయితే, ఈసారి బహిరంగ విచారణ జరపాలని వార్నర్ డిమాండ్ చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా మాజీ ఉద్యోగులు సహా ఘటనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ బహిరంగంగా వాస్తవాలు వెల్లడించాలని కోరాడు. మరోవైపు, ఈ వివాదం తన క్రికెట్ కెరీర్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని, 2019లో జస్టిన్ లాంగర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆస్ట్రేలియా జట్టుకు ఆడే అవకాశాలు దూరమయ్యాయని బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యానించాడు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!