

చైనాపై అమెరికా గూఢచర్యం చేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా అంగీకరించారు. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లిన ఆయన.. సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడారు. చైనా కూడా అమెరికాలో గూఢచర్యం చేస్తోందని, అయితే నిఘా కార్యకలాపాల్లో తామే మరింత సమర్థంగా వ్యవహరిస్తున్నామని వ్యాఖ్యానించారు. అమెరికా ఎలా, ఎక్కడ నిఘా నిర్వహిస్తోందనే వివరాలను వెల్లడించలేనని చెప్పారు. ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణలో చైనాకు సహకరిస్తోందన్న వాదనలను తోసిపుచ్చారు. ఒకవేళ బీజింగ్ అలాంటి సాయం చేస్తే తమకు వెంటనే తెలిసిపోతుందని అన్నారు. చైనాలో జరుగుతున్న పరిణామాల గురించి అమెరికాలోని కొన్ని విషయాల కంటే తమకు ఎక్కువ సమాచారం ఉందని వ్యాఖ్యానించారు.
చైనాతో చర్చల సందర్భంగా అమెరికాపై గూఢచర్యం ఆపాలని కోరుతారా? అని విలేకరులు ప్రశ్నించగా.. తాను ఆ మాట అనగానే అమెరికా నిఘాను ఆపాలని చైనా కూడా కోరుతుందని ట్రంప్ బదులిచ్చారు. ఎన్విడియా వ్యవహారంపైనా స్పందించిన ఆయన.. సంస్థ మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్‌ను మేధావిగా అభివర్ణిస్తూ, అలాంటి ప్రతిభావంతులను అమెరికా కాపాడుకోవాలని అన్నారు. ‘అలిస్’ అనే మహిళ చైనా గూఢచారి అన్న విషయం తనకు గతంలో తెలియదని చెప్పారు. చైనా నుంచి వచ్చే మహిళలను కొందరు సాధారణంగా గూఢచారులుగా అనుమానిస్తుంటారని వ్యాఖ్యానించారు. ఆమె ఒక వ్యాపారవేత్త అని, ఏఐ మోడళ్ల అభివృద్ధి కోసం అమెరికా చిప్‌లను కొనుగోలు చేయడానికి వచ్చారని తెలిపారు. అమెరికాకు ఆదాయం వస్తుంది కాబట్టి వాటి విక్రయానికి అనుమతించడంలో తప్పేముందని ప్రశ్నించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!