

యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. స్లమ్ డాగ్, హైందవ, స్వయంభు, బెంజ్, రాపో-23, ది బ్లాక్ గోల్డ్ వంటి చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. వరుస షూటింగ్‌లతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పోస్టుల ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. తాజాగా, తన నటనా ప్రయాణంలో భాగంగా చేపట్టిన ‘నవరస సాధన’ శిక్షణకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. గురు వేణు జీ మార్గదర్శకత్వంలో నటనకైరళి వేదికగా సాగిన ఈ శిక్షణకు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ, కళలోని గొప్పదనాన్ని వివరిస్తూ ప్రత్యేకమైన నోట్ రాశారు. ఈ సందర్భంగా అభినవగుప్తుడు చెప్పిన ఆలోచనలను కూడా ఆమె గుర్తుచేశారు.
ఒక నాటకం లేదా సినిమాలో వ్యక్తమయ్యే రసం కేవలం నటుడిలోనో, అతడు పోషించే పాత్రలోనో మాత్రమే ఉండదని సంయుక్త తన పోస్ట్‌లో వివరించారు. ఆ కళను చూసి మనస్ఫూర్తిగా ఆస్వాదించే ప్రేక్షకుడి హృదయాన్ని తాకినప్పుడే అసలైన కళానుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. నటుడికి, ప్రేక్షకుడికి మధ్య ఉన్న భేదం చెరిగిపోయి, కేవలం భావం మాత్రమే మిగిలినప్పుడు మనసులో ఒక ప్రత్యేకమైన ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయని.. ఆ అనుభూతినే ‘చమత్కారం’ అంటారని వివరించారు. గురు వేణు జీ వద్ద నేర్చుకున్న నవరస సాధన తనకు సరికొత్త అనుభవాన్ని అందించిందని తెలిపారు. ప్రస్తుతం సంయుక్త షేర్ చేసిన ఫొటోలతో పాటు, కళపై ఆమె రాసిన లోతైన వ్యాఖ్యలు నెటిజన్లు, సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!