

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) పీఎఫ్ ఉపసంహరణ నిబంధనల్లో కీలక మార్పులకు ఆమోదం తెలిపింది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు తమ పీఎఫ్ పొదుపు మొత్తాన్ని ఒకేసారి తీసుకోకుండా నెలవారీ వాయిదాల్లో ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం, ఉద్యోగులు తమ అవసరాలకు అనుగుణంగా కొంత మొత్తాన్ని తీసుకుని, మిగిలిన డబ్బును పీఎఫ్ ఖాతాలోనే ఉంచుకోవచ్చు. ఆ మొత్తంపై వర్తించే వడ్డీని కూడా పొందవచ్చు. అంతేకాకుండా, అసలు మొత్తాన్ని ఖాతాలోనే ఉంచి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే తీసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు.
ఈ నిర్ణయంతో పీఎఫ్ ఖాతాల్లో రూ.5 లక్షలకు పైగా నిల్వలు కలిగి, 55 ఏళ్లు దాటిన సుమారు 6.2 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. మరోవైపు, 55 ఏళ్లలోపు సభ్యులు తమ పీఎఫ్ నిల్వల్లో గతంలో ఉన్న 75 శాతం పరిమితికి బదులుగా 90 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం కల్పించనున్నారు. వాయిదాల రూపంలో చెల్లింపులు జరుగుతున్న సమయంలో సభ్యుడు మరణిస్తే, నామినీ లేదా కుటుంబ సభ్యులు మిగిలిన మొత్తాన్ని తీసుకోవచ్చు లేదా వాయిదాల చెల్లింపులను కొనసాగించవచ్చు. అయితే, ఈ మార్పులు వెంటనే అమల్లోకి రావు. ఈపీఎఫ్ఓ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసి, అవసరమైన మార్గదర్శకాలను ప్రకటించిన తర్వాతే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!