

తెలుగు సినీ పరిశ్రమ పక్కనున్న కోలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్‌లతో కాకుండా హాలీవుడ్‌తో పోటీపడే స్థాయికి చేరుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో సినీనిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ థియేటర్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తాను సినిమా అభిమాని అని, సినీరంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను చూశానని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో సినిమాలు రూపొందుతున్నప్పటికీ వాటిని ప్రదర్శించడానికి అత్యాధునిక థియేటర్లు కూడా అవసరమని ఆయన తెలిపారు.
తెలుగు సినీనటులు ఎన్నో ప్రయోగాలు చేసి విజయాలను సాధించారని సీఎం పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ సంవత్సరానికి అనేక సినిమాలు విడుదల చేసిన కాలాన్ని గుర్తు చేసుకున్నారు. మధ్యతరగతి ప్రజలపై సినిమాల ప్రభావం ఎంతో ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మా రంగాలతో పాటు సినీ పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాకుండా హాలీవుడ్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ డాల్బీ విజన్ వంటి ఆధునిక సాంకేతికత హైదరాబాద్‌కు రావడం గర్వకారణమని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ హైదరాబాద్‌ను ప్రపంచ సినీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి చేస్తున్నారని కొనియాడారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!