

ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మీడియాతో చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే కాకుండా ప్రభుత్వ స్థాయిలోనూ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ధోరణి కొనసాగితే అనవసర వివాదాలు తలెత్తే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో మహేష్ కుమార్ గౌడ్ పార్టీతో పాటు ప్రభుత్వంలోని అంతర్గత అంశాలపై బహిరంగంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. పార్టీ విషయాలపై అధ్యక్షుడిగా మాట్లాడటం సహజమే అయినప్పటికీ, ప్రభుత్వ వ్యవహారాలపై వ్యాఖ్యలు చేయడం సరికాదని సీనియర్ నేతలు సూచిస్తున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ ప్రక్షాళన, శాఖల మార్పులు వంటి అంశాలు పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి పరిధిలోనివేనని, ఆయన అధిష్టానంతో సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
అయితే పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వ పరిణామాలపై అవగాహన ఉండటం సహజమే అయినా, అలాంటి అంశాలను బహిరంగంగా వెల్లడించకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా సీనియర్ నేతలు సూచిస్తున్నారు. కేబినెట్ ప్రక్షాళనపై వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేస్తున్నారనే భావన కలుగుతోందని వారు అంటున్నారు. అలాగే ఐఏఎస్ అధికారుల పనితీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా విమర్శలకు దారితీస్తున్నాయి. అధికారుల పనితీరును అంచనా వేయాల్సింది సీఎం, మంత్రులేనని, ఈ అంశాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రతిపక్షానికి అవకాశాలు కల్పించినట్టేనని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!