

సీబీఎస్ఈ రీవాల్యూయేషన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో తమ ఆన్లైన్ పోర్టల్‌పై భారీ సైబర్ దాడి యత్నాలు జరిగాయని బోర్డు వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 16 వేల మంది విద్యార్థులు రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. ఇదే సమయంలో డినయల్-ఆఫ్-సర్వీస్ (DoS) విధానంలో దాడికి ప్రయత్నించగా, కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే దాదాపు 15 లక్షల లాగిన్ ప్రయత్నాలు నమోదయ్యాయని పేర్కొంది. అంతేకాకుండా ఫైళ్లు, సిస్టమ్‌లలోకి అనధికార ప్రవేశం కోసం లక్షకు పైగా సైబర్ దాడి ప్రయత్నాలను గుర్తించినట్లు వెల్లడించింది.
అయితే ఈ దాడులు జరిగినప్పటికీ పోర్టల్ నిరంతరాయంగా పనిచేస్తోందని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ఒకేసారి 8 వేల మందికిపైగా విద్యార్థుల దరఖాస్తులను స్వీకరించే సామర్థ్యం ఈ పోర్టల్‌కు ఉందని తెలిపింది. సాంకేతిక బృందాలు 24 గంటలూ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నాయని, ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా, 12వ తరగతి ఫలితాల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంపై కొందరు విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో, జవాబు పత్రాల స్కాన్ కాపీలను అందజేసి రీవాల్యూయేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. సైబర్ దాడులను విజయవంతంగా అడ్డుకున్నామని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!