

అమెరికాలో టెక్ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులు తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజులలోపు మరో ఉద్యోగాన్ని సంపాదించకపోతే అమెరికా విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్విడియా విదేశీ ప్రతిభను ఆకర్షించేందుకు భారీగా నియామకాలు చేపడుతోంది. 2026 తొలి రెండు త్రైమాసికాల్లో హెచ్-1బీ కేటగిరీ కింద 1,200 మంది ఉద్యోగులను నియమించేందుకు అనుమతులు పొందింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 1,000గా ఉండగా, ఇప్పుడు మరింత పెరిగింది. హెచ్-1బీ వీసాదారుల్లో 70 శాతానికి పైగా భారతీయులే ఉండటంతో ఈ అవకాశాలు ప్రధానంగా భారతీయ ఐటీ నిపుణులకు లభించే అవకాశముంది.
ఏఐ మరియు ఇంజినీరింగ్ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించేందుకు ఎన్విడియా కోట్ల రూపాయల వార్షిక వేతనాలను ఆఫర్ చేస్తోంది. ఇంజినీర్లు, రీసెర్చ్ సైంటిస్టులు, ప్రొడక్ట్ మేనేజర్లు, హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ మేనేజర్లు, డైరెక్టర్ స్థాయి ఉద్యోగులకు భారీ ప్యాకేజీలు ప్రకటించింది. ముఖ్యంగా ఏఐ అల్గారిథమ్ ఇంజినీర్లు, ప్రిన్సిపల్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు అత్యధిక డిమాండ్ ఉంది. ఇదే సమయంలో వ్యక్తిగత కంప్యూటర్ల కోసం ‘ఆర్టీఎక్స్ స్పార్క్’ అనే ఏఐ ఆధారిత సూపర్ చిప్‌ను కూడా ఎన్విడియా ఆవిష్కరించింది. ఈ చిప్ సహాయంతో మౌస్, కీబోర్డ్ అవసరం లేకుండానే ఏఐ ఏజెంట్లు కంప్యూటర్ను నిర్వహించే అవకాశం ఉండనుంది. ఈ చిప్‌ను ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ తైపేలో ఆవిష్కరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!