

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాటరైట్ గనుల వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం శాతం 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దానిని మైనర్ మినరల్గా కాకుండా బాక్సైట్గా పరిగణించాలని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్లో గనుల లీజుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయిందని సీఎం తన లేఖలో పేర్కొన్నారు.
గతంలో మైనర్ మినరల్ కింద ప్రాసెస్ చేసిన 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్లు చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో 19 లెటర్ ఆఫ్ ఇంటెంట్ దరఖాస్తులు, 113 ప్రభుత్వ భూముల దరఖాస్తులు, 255 అటవీ భూముల దరఖాస్తులు, 15 పట్టా భూముల దరఖాస్తులు ఉన్నాయని వివరించారు. పాత నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేశారని గుర్తుచేశారు. గతంలో మైకా, క్వార్ట్జ్, ఫెల్డ్స్పార్, బారైట్స్ ఖనిజాల వర్గీకరణ మార్పుల సమయంలో ఇచ్చినట్లే ‘సేవింగ్ క్లాజ్’ను లాటరైట్కు కూడా వర్తింపజేసి, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను మరో రెండేళ్లపాటు పాత నిబంధనల ప్రకారమే పరిశీలించాలని కోరారు. దీంతో ఆర్థిక నష్టం, న్యాయ వివాదాలు తగ్గడంతో పాటు పరిశ్రమలకు ముడిసరుకు సరఫరా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!