

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచవ్యాప్తంగా పౌరవిమానయాన రంగంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దుబాయ్, అబుధాబీ, దోహా వంటి కీలక విమానాశ్రయాలు మూతపడటంతో వేలాది ప్రయాణికులు వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు. పశ్చిమాసియాలో విమానం మారాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పవిత్ర మక్కా, మదీనాలకు వెళ్లిన లక్షలాది యాత్రికులు సౌదీ అరేబియాలోనే నిలిచిపోయారు. వీరిలో సుమారు 58 వేల మంది ఇండోనేసియా పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే క్రూజ్ ఓడల్లో ప్రయాణిస్తున్న 30 వేల మంది జర్మన్లు తిరుగు ప్రయాణం సాధ్యంకాక ఓడల్లోనే ఉండాల్సి వచ్చింది.
ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో అనేక అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎమిరేట్స్ పరిమిత విమానాలు మాత్రమే నడపనున్నట్లు ప్రకటించగా, ఖతార్ ఎయిర్వేస్ సేవలను నిలిపివేసింది. సౌదీలో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ఇండిగో జెడ్డా నుంచి హైదరాబాద్, ముంబయి, అహ్మదాబాద్‌లకు 10 ప్రత్యేక విమానాలు నడపనుంది. మరోవైపు, పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ వందల అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!