

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల కారణంగా పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తతల ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 23 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు కాగా, విమానయాన సంస్థలకు 100 కోట్ల డాలర్లకుపైగా (సుమారు రూ.9,165 కోట్లు) నష్టం వాటిల్లింది. భారత విమానయాన సంస్థలపై దీని ప్రభావం అధికంగానే ఉన్నది. పాసింజర్ ట్రాఫిక్ కోసం గల్ఫ్ రూట్లపై ప్రధానంగా ఆధారపడే భారత విమానయాన సంస్థలు యుద్ధ ప్రారంభ రోజుల్లో తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
మార్చి ప్రారంభం నాటికి 1,221 భారతీయ విమానాలు రద్దయినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. దుబాయ్, అబు ధాబి, యూఏఈలోని షార్జా, జెడ్డా, రియాద్, సౌదీ అరేబియాలోని దమ్మమ్, ఒమన్‌లోని మస్కట్, ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ సహా ప్రధాన రూట్లలో రోజూ ప్రధాన విమానయాన సంస్థల సర్వీసుల నిలిపివేత జరిగింది. నిలిచిపోయిన ప్రయాణికులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు దుబాయ్, జెడ్డా నుంచి ప్రత్యేక విమానాలను కూడా చాలా పరిమితంగా ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్నది.
దేశంలో అత్యధికంగా విమాన సర్వీసులను నడిపే ఇండిగోపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. గల్ఫ్ రూట్లలో రోజూ 65 ట్రిప్పులను ఇండిగో నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు 500కిపైగా పశ్చిమాసియా, కొన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. వీటిలో మార్చి 3న ఒక్కరోజే 162 విమానాలు రద్దయ్యాయి. భారత నగరాల నుంచి దోహ, దుబాయ్, అబు ధాబి వంటి నగరాలకు వెళ్లే ట్రాఫిక్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన యావత్ గల్ఫ్ రూట్లయిన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ సహా అంతర్జాతీయ సర్వీసులను మార్చి 1 వరకు రద్దు చేసింది. స్పైస్ జెట్ తన యూఏఈ, ఇతర గల్ఫ్ నగరాలకు విమాన సర్వీసులను రద్దు చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!