

తిరుమలలో జరిగే వైకుంఠ ద్వార దర్శనాలకు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
తిరుమలలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ నాయుడు, మొదటి మూడు రోజుల పాటు ఎలక్ట్రానిక్ లక్కీడిప్ విధానంలో భక్తులకు దర్శన టోకెన్లు కేటాయించినట్లు చెప్పారు. మిగతా ఏడు రోజులలో టోకెన్లు లేకున్నా, సామాన్య భక్తులకు సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాట్లు, సౌకర్యాల పై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు.
దాత మంతెన రామలింగరాజు సహకారంతో పీఏసీలను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకోసం ఆయన ఇటీవల రూ.9 కోట్లు విరాళంగా అందించినట్లు తెలిపారు. అలాగే ఆలయ ధ్వజ స్తంభాల కోసం అవసరమైన దివ్య వృక్షాలను పెంచేందుకు టీటీడీ స్వయంగా 100 ఎకరాల్లో సాగు చేపట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీని కోసం పలమనేరులోని టీటీడీ గోశాల పరిసర ప్రాంతాన్ని అనువైన స్థలంగా గుర్తించినట్లు వెల్లడించారు.
మంగళవారం టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుందని, సుమారు 50 అజెండా అంశాల పై చర్చ జరుగుతుందని తెలిపారు. దివ్య వృక్షాల ప్రాజెక్టు పై కూడా పాలక మండలిలో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని బీఆర్ నాయుడు చెప్పారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!