

ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా జెండాతో ప్రయాణిస్తున్న వెనెజువెలా చమురు నౌక మ్యారినెరా తో పాటు మరో నౌకను అమెరికా బుధవారం స్వాధీనం చేసుకోవడంతో అంతర్జాతీయంగా కలకలం రేగింది. ఈ ఆపరేషన్‌కు బ్రిటన్ మద్దతు ఇవ్వడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
అమెరికా నౌకాదళం హెలికాప్టర్ల సహాయంతో నౌకపైకి మెరైన్ సిబ్బందిని దించి, అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకుంది. అనంతరం నౌకను దక్షిణ దిశగా మళ్లించింది. ఐస్లాండ్ దక్షిణ తీరానికి సమీపంలో ఈ చర్య చేపట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో ఎలాంటి జాతీయ జెండా లేని మరో నౌకను కూడా అమెరికా సీజ్ చేసింది.
ఈ నౌకలు రష్యా, ఇరాన్, వెనెజువెలా నుంచి ఆసియా దేశాలకు చమురు సరఫరా చేస్తూ అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించాయని అమెరికా ఆరోపిస్తోంది. ఇప్పటికే 2024 లోనే ఈ నౌకపై ఆంక్షలు విధించినట్లు వెల్లడించింది. అయితే ఈ చర్య పై రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నౌక అంతర్జాతీయ జలాల్లో చట్టబద్ధంగా ప్రయాణిస్తోందని, 1982 ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టానికి విరుద్ధంగా అమెరికా సీజ్ చేసిందని రష్యా పేర్కొంది. నౌక సిబ్బంది హక్కులను కాపాడాలని డిమాండ్ చేసింది.
ఈ ఘటనతో ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరింత సున్నితంగా మారాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!