

గ్రీన్‌లాండ్‌పై అమెరికా కన్నేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. మాట వినకపోతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని అమెరికా హెచ్చరిస్తుండటంతో గ్రీన్‌లాండ్‌తో పాటు దానిపై పాక్షిక ఆధిపత్యం ఉన్న డెన్మార్క్ తీవ్రంగా స్పందిస్తున్నాయి. అవసరమైతే యుద్ధానికి సిద్ధమేనని డెన్మార్క్ సవాల్ విసురుతోంది. ఈ పరిస్థితుల్లో నిజంగా అమెరికాను డెన్మార్క్ అడ్డుకోగలదా, ఐరోపా కూటమి మద్దతు లభిస్తుందా అన్న ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరోవైపు, గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకోవాల్సిన అవసరమే అమెరికాకు లేదని, ఇప్పటికే అక్కడ భారీ సైనిక ఉనికి ఉందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా సైనిక చర్యకు దిగితే 1952 కోల్డ్‌వార్ కాలం నాటి ఒప్పందం ప్రకారం వెంటనే ప్రతిచర్యకు దిగే హక్కు తమకుందని డెన్మార్క్ స్పష్టం చేసింది. ఆక్రమణ ప్రయత్నం జరిగితే కమాండర్ల ఆదేశాల కోసం ఎదురుచూడకుండా డానిష్ సైన్యం ప్రతిఘటించవచ్చని తెలిపింది. 1940 లో నాజీ జర్మనీ డెన్మార్క్‌ను ఆక్రమించిన తర్వాత ఈ నిబంధనను తీసుకొచ్చారు. గ్రీన్లాండ్, ఫారో ఐలాండ్స్ రక్షణ బాధ్యతలను డెన్మార్క్‌కు చెందిన సంయుక్త ఆర్కిటిక్ కమాండ్ నిర్వహిస్తోంది.
ఈ సంయుక్త ఆర్కిటిక్ కమాండ్ ప్రధాన కార్యాలయం నూక్‌లో ఉంది. డెన్మార్క్ త్రివిధ దళాలు, ప్రత్యేక బలగాలు ఇందులో భాగం. నిఘా, సార్వభౌమత్వ రక్షణ, సెర్చ్ అండ్ రెస్క్యూ, ఫిషరీస్ ఇన్స్పెక్షన్ వంటి కీలక బాధ్యతలు దీని పరిధిలో ఉంటాయి. ప్రపంచ సైనిక శక్తుల ర్యాంకింగ్‌లో డెన్మార్క్ 145 దేశాల్లో 45 వ స్థానంలో ఉంది. అయితే అమెరికా సైనిక బలంతో పోలిస్తే ఇది చాలా చిన్నదే అయినా, ఐరోపా మద్దతుతో బలమైన ప్రతిఘటన సాధ్యమవుతుందన్న అంచనాలు ఉన్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!