

విద్యార్థులలో చదువు పై ఆసక్తిని పెంపొందించడంతో పాటు డిజిటల్ స్క్రీన్ వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, సెకండరీ పాఠశాలల విద్యార్థులు ప్రతిరోజూ వార్తాపత్రికలు చదవడం తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిర్ణయం అమలులో భాగంగా పాఠశాలల గ్రంథాలయాల్లో హిందీ మరియు ఇంగ్లీష్ వార్తాపత్రికలను అందుబాటులో ఉంచనున్నారు. ప్రతిరోజూ విద్యార్థులు కొంత సమయం కేటాయించి పేపర్లు చదవాల్సి ఉంటుంది. దీనివల్ల వారి పఠన నైపుణ్యం మెరుగుపడటంతో పాటు సమాజం పై అవగాహన పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మార్గదర్శకాలను అడిషనల్ చీఫ్ సెక్రటరీ (బేసిక్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్) పార్థ సార్థి సేన్ శర్మ డిసెంబర్ 23 న అధికారికంగా విడుదల చేశారు. ఇప్పటికే నవంబర్ నెలలో పిల్లల్లో పఠనాసక్తి పెంపు పై చర్చించిన ప్రభుత్వం, ఆ నిర్ణయాలకు కొనసాగింపుగా ఈ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త విధానం ప్రకారం, ఉదయపు అసెంబ్లీ సమయంలో విద్యార్థులు 10 నిమిషాల పాటు వార్తాపత్రికలు చదవాలి. ఒకరి తర్వాత ఒకరు ఎడిటోరియల్ కాలమ్‌లోని ముఖ్యాంశాలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, అలాగే క్రీడలకు సంబంధించిన సానుకూల వార్తలను చదివి వినిపించనున్నారు. ఈ విధానం ద్వారా విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, అవగాహన, భాషా నైపుణ్యాలు మరింత మెరుగవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!