

అమెరికా పౌరసత్వం లేదా దీర్ఘకాలిక నివాసం కోరుకునే ధనికుల కోసం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన ‘గోల్డ్ కార్డు’ ప్రోగ్రామ్ అధికారికంగా ప్రారంభమైంది. వైట్‌హౌస్‌లో వ్యాపారవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు.
గోల్డ్ కార్డు ద్వారా అమెరికాలో నివసించాలనుకునే వ్యక్తులు 1 మిలియన్ డాలర్లు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీలు తమ ప్రతిభావంతులైన ఉద్యోగులను యూఎస్‌లో ఉంచడానికి 2 మిలియన్ డాలర్లు చెల్లించే అవకాశం కూడా ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక అధికారిక వెబ్సైట్ కూడా ప్రవేశపెట్టబడింది, ఇది ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తోంది.
1990 లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రవేశపెట్టిన EB-5 ప్రోగ్రామ్‌లో సంవత్సరాల తరబడి ఆలస్యం, మోసాలు, అక్రమాలు జరుగుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సమస్యలకు పరిష్కారంగా, వేగవంతమైన మరియు పారదర్శక పద్ధతిగా గోల్డ్ కార్డు వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు.
వ్యాపార రంగం నుంచి వీసా నియమాల పై వచ్చిన ఒత్తిడిని ప్రస్తావించిన ట్రంప్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ మాటలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. వీసా అనిశ్చితుల కారణంగా కంపెనీలు అత్యున్నత ప్రతిభను కోల్పోతున్నాయని కుక్ తనతో చెప్పారని ట్రంప్ తెలిపారు. కొత్త గోల్డ్ కార్డు కార్యక్రమం ద్వారా అమెరికా ఖజానాకు బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వైట్‌హౌస్ కూడా బుధవారం మధ్యాహ్నం నుంచే ఈ గ్రీన్ కార్డు/గోల్డ్ కార్డు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించడం ప్రారంభించింది.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!