

ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంగా గుర్తింపు పొందిన కాషివాజాకి-కరీవా అణు విద్యుత్ కేంద్రం ను జపాన్ ప్రభుత్వం సోమవారం తిరిగి ప్రారంభించింది. గతంలో సాంకేతిక లోపాల కారణంగా నిలిచిపోయిన ఈ కేంద్రం ఇప్పుడు మళ్లీ విద్యుదుత్పత్తికి సిద్ధమైంది.
2011లో సంభవించిన భారీ భూకంపం, సునామీ కారణంగా ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం లో తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఘటన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా దేశవ్యాప్తంగా అణు విద్యుత్ కేంద్రాలను జపాన్ ప్రభుత్వం మూసివేసింది.
అయితే, కాలక్రమేణా శిలాజ ఇంధనాల పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం పెరగడంతో పాటు, 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ సాధించాలనే లక్ష్యాన్ని జపాన్ నిర్దేశించుకుంది. అంతేకాకుండా కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతల విస్తరణతో విద్యుత్ అవసరాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం మళ్లీ అణుశక్తి వైపు దృష్టి సారిస్తోంది.
ఈ క్రమంలో కాషివాజాకి-కరీవా ప్లాంట్‌ను ఈ ఏడాది జనవరిలోనే పునఃప్రారంభించేందుకు ప్రయత్నించారు. అయితే, మానిటరింగ్ అలారం మోగడంతో ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.
ఇప్పుడు ఈ కేంద్రంలోని ఒక రియాక్టర్‌ను సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభించినట్లు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెలలో సమగ్ర భద్రతా తనిఖీలు పూర్తయిన అనంతరం ఈ ప్లాంట్‌లో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
ఈ అణు విద్యుత్ కేంద్రంలో మొత్తం ఏడు రియాక్టర్లు ఉండగా, వాటిని దశలవారీగా సేవల్లోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!