

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయని, ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
12702 గ్రామ పంచాయతీలలో 7527 చోట్ల కాంగ్రెస్, 808 చోట్ల కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధించారని చెప్పారు. మొత్తం 8335 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్స్ గెలిచారని, అంటే 66 శాతం ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయని వెల్లడించారు. బీఆరెస్, బీజేపీ కూటమికి 33 శాతం, కమ్యూనిస్టులకు 1 శాతం ఫలితాలు వచ్చాయని తెలిపారు.
గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రులతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసిన అధికారులను అభినందించారు. ఇవి రెండేళ్ల ప్రజా పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని పేర్కొన్నారు.
కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని తెలిపారు. 94 శాసనసభ నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అత్యధిక ఫలితాలు సాధించిందన్నారు. బీఆరెస్ 6 నియోజకవర్గాల్లో, బీజేపీ 1 నియోజకవర్గంలో అత్యధిక ఫలితాలు సాధించాయని చెప్పారు.
పేదలకు అందించిన సన్నబియ్యం, ఉచిత కరెంటు, సజ్జ వడ్లకు బోనస్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఎస్సీ వర్గీకరణ అమలు, కులగణన వంటి పథకాలతో ప్రజలు మమ్మల్ని ఆదరించారని అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛను అందించామని చెప్పారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపించామని, హోదాలను అడ్డుపెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదన్నారు. గెలిస్తే కళ్లు నెత్తికెక్కినట్లుగా వ్యవహరించలేదని, ఈ ఫలితాలు మాపై మరింత బాధ్యతను పెంచాయని పేర్కొన్నారు.
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చి పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను బీజేపీ చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కొందరికి ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు.
ఒకాయన కడుపులో మూసీలో కాలుష్యానికి మించిన విషం ఉందని వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు చూసి అద్భుతం అంటూ కొందరు జబ్బలు చరుచుకుంటున్నారని చెప్పారు. 2029లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని, రెండు మూడొంతుల మెజారిటీతో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మీ కోపంతో, అసూయతో ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకోవద్దని హితవు పలికారు. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో ఉండగానే ఆయన్ను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చామని, ఇప్పుడు ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరని చెప్పారు.
కేసీఆర్‌కు సూటిగా సవాల్ విసురుతున్నానని, ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమని చెప్పండి అన్నారు. కృష్ణా జలాలపై ఎవరు అన్యాయం చేశారో చర్చకు సిద్ధమని, ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే గత పదేళ్లలో తెలంగాణ ప్రజలకు బీఆరెస్, కేసీఆర్ తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాలపై వారు చేసిన ద్రోహాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తామని తెలిపారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీలో చర్చించి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీఆరెస్ గెలవలేదని, కేటీఆర్‌ను తప్పించాలని హరీశ్ వర్గం సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టిందని వ్యాఖ్యానించారు. అందుకే ఆ విషయం చర్చకు రాకుండా కేటీఆర్ జిల్లాల పర్యటనలు మొదలు పెట్టారని అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!