

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే దుబాయ్ ఎయిర్‌షో చివరి రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్–ఎమ్కే1 ప్రదర్శన సమయంలో కూలిపోయి ధ్వంసమైంది. అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎగిరిన తేజస్ విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి నేలకు పడిపోయింది. వందలాది మంది చూస్తుండగానే యుద్ధవిమానం మంటల్లో చిక్కుకుంది. ప్రమాదంలో పైలట్ తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాయుసేన ధృవీకరించింది. పైలట్ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని కూడా పేర్కొంది.
ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్లు వాయుసేన అధికారులు తెలిపారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన ఈ సింగిల్ సీటర్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ గాల్లోకి విన్యాసాలు చేసే సమయంలో ‘నెగెటివ్ జీ–ఫోర్స్’ టర్న్‌లో విమానాన్ని తిరిగి పైకి లేపే క్రమంలో సమస్య ఎదురై ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
తేజస్ విమానం మొదటిసారి 2001లో గాల్లోకి ఎగిరింది. గత 24 ఏళ్లలో ఇది రెండోసారి మాత్రమే ఈ రకం యుద్ధవిమానం కూలిన ఘటన. గత సంవత్సరం రాజస్థాన్‌లో కూడా శిక్షణా విన్యాసాల సందర్భంగా తేజస్ కూలినప్పటికీ ఆ సమయంలో పైలట్ పారాచూట్‌తో బయటపడి ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇదిలా ఉండగా, కొన్ని పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ తేజస్ విమానంలో ఆయిల్ లీకేజీ జరుగుతోందని ఫేక్ వీడియోలను ప్రచారం చేశాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతనిచ్చింది. ఆ వీడియోలో కనిపించిన ద్రవం సాధారణంగా టేకాఫ్‌కు ముందు జరిగే ‘డ్రెయినింగ్ ప్రక్రియ’లో బయటపడే ద్రవమేనని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందం తెలిపింది. తేజస్‌లో ఎలాంటి సాంకేతిక లోపం లేదని కూడా పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచిస్తూ దేశ రక్షణ సామర్థ్యంపై అనుమానం రేకెత్తించే తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని, పంచేముందు వాస్తవాలు తెలుసుకోవాలని హెచ్చరించింది.
ఎయిర్‌షో చివరి రోజున తేజస్ ‘బారెల్ రోల్’ విన్యాసం చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ విన్యాసంలో విమానం నిలువుగా 360 డిగ్రీలు తిరుగుతుంది. మధ్యలో పైలట్ తలకిందులుగా ఉండే క్రమంలో వేగం తగ్గిపోవడం లేదా ఇంజిన్ సమస్య తలెత్తి ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!