

అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై తెలంగాణ సీఐడీ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో 11 మంది నిందితులను అరెస్ట్ చేసింది. అరెస్టైన వారిలో బెట్టింగ్ నిర్వాహకులు, వారి సహాయకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో నిర్వహించిన పాన్ ఇండియా ఆపరేషన్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఐడీ చీఫ్ చారు సిన్హా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నుంచి బదిలీ అయిన ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులను సీఐడీ విచారిస్తోందని తెలిపారు. కరీంనగర్‌లో నమోదైన "డాఫా బెట్" కేసును ఛేదించినట్లు వెల్లడించారు. ఈ కేసులో నిర్వాహకులు రోజుకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. 46 మ్యూల్ బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 414 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 108 బెట్టింగ్ యాప్‌లను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి బ్లాక్ చేయాలని ప్రతిపాదనలు పంపామని, 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కౌన్సెలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి యాప్‌లను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!