

అమెరికా అంతరిక్ష సంస్థ NASA లో 27 సంవత్సరాల పాటు అంకితభావంతో సేవలందించిన ప్రముఖ వ్యోమగామి సునీతా విల్లియమ్స్ అధికారికంగా రిటైర్ అయ్యారు. ఆమె రిటైర్మెంట్ డిసెంబర్ 27, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. సునీతా విలియమ్స్ తన కెరీర్లో నాయకత్వం, ధైర్యం, శాస్త్రీయ నైపుణ్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ప్రేరణగా నిలిచారు. మానవ అంతరిక్ష అన్వేషణలో ఆమె పేరు ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలుస్తుంది.
మూడు వేర్వేరు మిషన్లలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో ఆమె మొత్తం 608 రోజులు గడిపారు. ఇది నాసా వ్యోమగాముల్లో రెండవ అత్యధిక అంతరిక్ష కాలంగా గుర్తింపు పొందింది. అంతేకాదు, ఆమె 9 స్పేస్‌వాక్‌లు నిర్వహించి, మొత్తం 62 గంటలకు పైగా అంతరిక్షంలో పనిచేశారు. ఇది నాసా చరిత్రలో ఏ మహిళకైనా అత్యధికం.
ఆమె చివరి మిషన్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆసక్తిని రేకెత్తించింది. బోయింగ్ స్టార్‌లైనర్ నౌకలో నిర్వహించాల్సిన సాధారణ పరీక్షా ప్రయాణం అనుకోకుండా పొడిగింపునకు గురై, తక్కువ కాలం కోసం ప్లాన్ చేసిన మిషన్ తొమ్మిది నెలల పాటు ISS లో కొనసాగింది. చివరకు ఆమె మార్చి 2025 లో స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా సురక్షితంగా భూమికి తిరిగివచ్చారు.
సునీతా విలియమ్స్ రిటైర్మెంట్తో నాసా ఒక గొప్ప అనుభవజ్ఞురాలిని వీడ్కోలు చెప్పినట్లయింది. అయితే ఆమె స్ఫూర్తి మాత్రం భవిష్యత్ తరాల వ్యోమగాములకు మార్గదర్శకంగా నిలుస్తుంది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!