

హైదరాబాద్ శివారులోని కన్హా శాంతి వనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించారు. ఆధ్యాత్మికత ద్వారానే విశ్వ చైతన్యం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా కన్హా శాంతి వనం నిర్వాహకులతో పాటు శ్రీరామ చంద్ర మిషన్ ప్రెసిడెంట్ దాజీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఉన్న ఈ శాంతి వనంలో విస్తృతంగా పర్యటించారు.
శాంతి వనంలో ఉన్న వెల్నెస్ సెంటర్, యోగా సౌకర్యాలు, హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్, పుల్లెల గోపీచంద్ స్టేడియం వంటి సదుపాయాలను దాజీతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. అలాగే అక్కడ జరుగుతున్న శాస్త్రీయ, వృక్షశాస్త్ర పరిశోధనలపై ఆయన వివరాలు తెలుసుకున్నారు. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ రెయిన్ ఫారెస్ట్‌ను సందర్శించారు. రెయిన్ ఫారెస్ట్ రూపకల్పనతో పాటు దానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను దాజీ సీఎంకు వివరించారు. ధ్యాన మందిరం వెలుపల ఉన్న వర్షపు నీటి సంరక్షణ ప్రాంతమైన బాబూజీ వనాన్ని కూడా ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కన్హా శాంతి వనంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే వాతావరణం ఉందని, ఇది స్వర్గాన్ని తలపించేలా ఉందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ శాంతి వనాన్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతమని ప్రశంసించారు. విద్యారంగంలో కొత్త ప్రమాణాలు పాటిస్తూ హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దుతోందని అన్నారు. సీఎం పర్యటనపై సంతోషం వ్యక్తం చేసిన దాజీ, శ్రీరామ చంద్ర మిషన్ విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో నిరంతరం సేవలు అందిస్తోందని తెలిపారు.
















కామెంట్స్ (1)
Great place to visit around Hyd..