

పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు క్రైమ్ నంబర్ 243/2024 దర్యాప్తులో భాగంగా, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావును 2026 జనవరి 20న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించినట్లు సిట్ తెలిపింది. సాయంత్రం తన కుమారుడికి విమాన ప్రయాణం ఉన్నందున హరీష్ రావు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఆ రోజు విచారణను ముగించి వెళ్లేందుకు అనుమతించినట్లు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి సాక్షులను సంప్రదించకూడదని, ప్రభావితం చేయరాదని, ఎలాంటి జోక్యం చేసుకోరాదని ఆయనకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సిట్ పేర్కొంది. అవసరమైతే తదుపరి విచారణకు మళ్లీ పిలుస్తామని కూడా తెలియజేసింది.
ఈ విచారణ పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు మాత్రమే పరిమితమైందని, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా, చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం, నిఘా ఉంచడం వంటి ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని సిట్ స్పష్టం చేసింది. ఈ కేసులో 2024 మార్చి 10 నుంచి సమగ్ర దర్యాప్తు జరుగుతుండగా, ఇప్పటికే కొంతమంది నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపింది. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హరీష్ రావును విచారిస్తున్నారంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!